గుంటూరు జిల్లాను రాష్ట్రంలోనే వాణిజ్య, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన స్టేక్‌హోల్డర్ల సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్వర్ణాంధ్ర @2047 కార్యక్రమంలో పాల్గొని జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు మహ్మద్ నజీర్, గల్లా మాధవిలతో కలసి మీడియాతో మాట్లాడిన మనోహర్ అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడంతో గుంటూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అవకాశం ఉందన్నారు.
జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నేత కార్మికుల కోసం చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.