ఇన్వెస్టర్లను నిండా ముంచిన HDFC, LIC షేర్లు.. 5 రోజుల్లోనే రూ. లక్ష కోట్లు లాస్.. సీన్ రివర్స్!

దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల కిందట సూచీలు జీవన కాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి మళ్లీ దిగొస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్ విలువ పరంగా భారత్‌లోని టాప్-10 కంపెనీల విలువ వారం వ్యవధిలో (స్టాక్ మార్కెట్ పనిచేసేది 5 రోజులే) రూ. 1,73,097.59 కోట్లు తగ్గింది. అంటే ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో నష్టపోయారని చెప్పొచ్చు. ఎక్కువగా వీటిల్లో ప్రైవేట్ రంగ అతిపెద్ద బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు ఉన్నాయి. గత వారం BSE బెంచ్‌మార్క్ ఇండెక్స్- సెన్సెక్స్ 1213.68 పాయింట్లు కోల్పోయింది.

వీటిల్లో HDFC బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Mcap) 5 రోజుల్లోనే ఏకంగా రూ. 60,678.26 కోట్ల పతనంతో రూ. 10,93,026.58 కోట్లకు పడిపోయింది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ. 43,168.1 కోట్లు పడిపోయి రూ. 5,76,049.17 కోట్లుగా నమోదైంది. ఈ రెండింటితోనే రూ. లక్ష కోట్లకుపైగా ఇన్వెస్టర్లు కోల్పోయారు. మార్కెట్ విలువను బట్టి చూస్తే దేశంలోనే అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ. 36 వేల కోట్లకుపైగా పడిపోగా.. ఇది రూ. 19,04,643.44 కోట్లకు చేరింది.

రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ. 17,567.94 కోట్లు దిగొచ్చి ఇప్పుడు అది రూ. 7,84,833.83 కోట్లకు చేరింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ విలువ రూ. 11,780.49 కోట్ల పతనంతో రూ. 7.30 లక్షల కోట్లకు చేరింది. ఐటీసీ మార్కెట్ వాల్యూ రూ. 3807.84 కోట్లు తగ్గి ఇప్పుడు రూ. 5.40 లక్షల కోట్లకు పతనమైంది.

ఇక హిందుస్థాన్ యూనీలివర్ మార్కెట్ విలువ 5 రోజుల వ్యవధిలో రూ. 33,270.22 కోట్లు పెరిగి రూ. 5.53 లక్షల కోట్లకు చేరింది. టాటా గ్రూప్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ విలువ కూడా రూ. 20,442.2 కోట్లు పెరిగి ఇప్పుడు రూ. 14.09 లక్షల కోట్లుగా ఉంది. ఇక భారతీ ఎయిర్‌టెల్ ఎం క్యాప్ రూ. 14,653.98 కోట్లు ఎగబాకి రూ. 7.38 లక్షల కోట్లకు చేరింది. ఇక ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ. 3611.26 కోట్లు పెరిగి రూ. 5.91 లక్షల కోట్లుగా నమోదైంది.

ఇక మార్కెట్ విలువ పరంగా టాప్-10 కంపెనీల వరుస క్రమం చూస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ ఉన్నాయి.

About The Author: న్యూస్ డెస్క్