జార్ఖండ్‌ జై కొట్టేదెవరికి?

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్షంగా అండగా నిలిచిన రాష్ర్టాల్లో జార్ఖండ్‌ ఒకటి. రెండుసార్లూ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వార్‌ వన్‌సైడ్‌ అన్నట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 14 స్థానాల్లో బీజేపీ 12 గెలుచుకుంది.

  • గత రెండు ఎన్నికల్లో 14లో 12 సీట్లు బీజేపీకే
  • ఈసారి గట్టి పోటీ ఇస్తున్న జేఎంఎం – కాంగ్రెస్‌
  • కలిసొస్తున్న హేమంత్‌ సొరేన్‌ అరెస్టు సానుభూతి
  • 5 ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాల్లో బీజేపీకి ఇబ్బందులే
  • కాంగ్రెస్‌, జేఎంఎంపై అవినీతి ఆరోపణలే బీజేపీ బలం

రాంచి, మే 12: గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్షంగా అండగా నిలిచిన రాష్ర్టాల్లో జార్ఖండ్‌ ఒకటి. రెండుసార్లూ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వార్‌ వన్‌సైడ్‌ అన్నట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 14 స్థానాల్లో బీజేపీ 12 గెలుచుకుంది. జేఎంఎం, కాంగ్రెస్‌తో కూడిన యూపీఏ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యింది.

ఈసారి కూడా జార్ఖండ్‌లో గత ఎన్నికల ఫలితాలనే రిపీట్‌ చేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఇచ్చిన ైస్థెర్యంతో బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లోనూ బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సిద్ధమైంది. ఇండియా కూటమి ఈసారి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ర్టాల్లో జార్ఖండ్‌ ముందువరుసలో ఉంది. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. మే 13, 20, 25, జూన్‌ 1న నాలుగు దశల్లో జార్ఖండ్‌లోని 14 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అన్ని స్థానాల్లో ద్విముఖ పోరు
రాష్ట్రంలోని మొత్తం 14 స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు నెలకొన్నది. ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌(ఏజేఎస్‌యూ)తో కలిసి ఎన్డీఏ కూటమిగా బీజేపీ పోటీ చేస్తున్నది. బీజేపీ 13 స్థానాల్లో, ఏజేఎస్‌యూ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి.

ఇక, మరోవైపు కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం), సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) కలిసి ఇండియా కూటమిగా బరిలో నిలిచాయి. కాంగ్రెస్‌ ఏడు స్థానాల్లో, జేఎంఎం ఐదు స్థానాల్లో పోటీ చేస్తుండగా, సీపీఐ(ఎంఎల్‌)ఎల్‌కు ఒక స్థానం, ఆర్జేడీకి ఒక స్థానం కేటాయించారు. ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ కుదరక సీపీఐ, సీపీఎం విడిగా పోటీ చేస్తున్నాయి. సీపీఐ నాలుగు సీట్లలో, సీపీఎం ఒక స్థానంలో బరిలో ఉన్నాయి.

సీట్లు తగ్గొద్దని బీజేపీ పంతం
ఇండియా కూటమి నేతలపై అవినీతి ఆరోపణలు, ప్రధాని మోదీ ఇమేజ్‌ను బీజేపీ నమ్ముకున్నది. జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌ అవినీతి ఆరోపణలతో అరెస్టు కావడం, కాంగ్రెస్‌ మంత్రి ఆలంగిర్‌ ఆలం వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో కోట్లలో నగదు బయటపడటం వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తున్నది. అయితే, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య విభేదాలు, కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ గీతా కోడాకు టికెట్‌ ఇవ్వడం, యశ్వంత్‌ సిన్హా కుమారుడు జయంత్‌ సిన్హాను పోటీ నుంచి తప్పించడం బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.

రెండు స్థానాలపై ఇండియా కూటమి ఆశలు
రెండంకెల సీట్లపై ఆశలు పెట్టుకున్న ఇండియా కూటమి మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌ అరెస్టు సానుభూతి తమకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా ప్రారంభించిన సంక్షేమ పథకాలు కూడా కలిసొస్తాయని నమ్ముతున్నది. అయితే, కూటమిని ముందుండి నడిపించాల్సిన హేమంత్‌ సొరేన్‌ జైలులో ఉండటం, మాజీ సీఎం మధు కోడా భార్య, కాంగ్రెస్‌ ఒక్కగానొక్క ఎంపీ గీతా కోడా బీజేపీలోకి వెళ్లిపోవడం మైనస్‌గా మారింది.

ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాల్లో బీజేపీకి దెబ్బ?
జార్ఖండ్‌లో ఐదు ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలున్నాయి. వీటిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొన్నది. గత ఎన్నికల్లో వీటిల్లో యూపీఏ రెండు గెలుచుకుంది. మిగతా మూడు ఎన్డీఏ గెలిచినా అతి తక్కువ మెజారిటీలు మాత్రమే సాధించింది. ఈసారి ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలపై ఇండియా కూటమి కూడా గంపెడాశలు పెట్టుకుంది.

ముఖ్యంగా గిరిజనుడైన హేమంత్‌ సొరేన్‌ను బీజేపీ అక్రమంగా అరెస్టు చేయించిందనే సానుభూతితో గిరిజనులు ఇండియా కూటమి వైపే ఉంటారని భావిస్తున్నది. గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి రెండు కూటముల మధ్య హోరాహోరీ తప్పదని, సాధించబోయే సీట్ల సంఖ్య కూడా ఇలాగే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

 
 

About The Author: న్యూస్ డెస్క్