కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవిని కలిసి పలు అంశాలపై చర్చించారు. దీనిపై బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించారు.
'నా మెగాస్టార్ అన్న చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. చిరంజీవి నిరాడంబరమైన వ్యక్తి, నా శ్రేయోభిలాషి. కాలేజీ రోజుల నుంచి ఆయన సినిమాలకు నేను అభిమానిని అని ట్వీట్ చేశాడు. బండి సంజయ్ చిరంజీవిని కలిసిన చిత్రాలను కూడా పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కేంద్రం నుంచి పద్మవిభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ఆయన... అధికారికంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ఇంకా ప్రకటించకపోవడమే ఇందుకు కారణం.
అయితే ఆయనకు రాజ్యసభలో అవకాశం ఇవ్వాలని కేంద్రం పెద్దలు ఆలోచిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చిరంజీవి వద్దకు వెళ్లి ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.